Watch “Biggest and Smallest Animal Organs Too Extreme to Be Real” on YouTube

మహాప్రస్థానం పుస్తకం సమీక్ష (Review of the Book)

పుస్తకం పేరు : మహాప్రస్థానం

రచయిత : శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)

పేజీలు : 108

వెల : రూ.50

ప్రక్రియ : కవితా సంపుటి

ప్రతులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌

4-1-435, విజ్ఞాన్‌ భవన్‌

అబిడ్స్‌, హైదరాబాద్‌- 500 001

ఫోన్‌ : 24744580 / 24735905

రచయిత గురించి : “మానవుడే నా సందేశం-మనుష్యుడే నా సంగీతం” అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ ఏప్రిల్‌30, 1910లో విశాఖపట్నంలో జన్మించారు. శ్రీశ్రీ ఓ విప్లవ కవి, హేతువాది, అభ్యుదయవాది, నాస్తికుడు. తెలుగు కవిత్వాన్ని మరో మలుపు తిప్పిన శ్రీశ్రీ “మహాప్రస్థానం”1950లో, పుస్తకరూపం ధరించింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ ఓ ప్రభంజనం. ఎనిమిదవ ఏటనే గోకులాయి, వీరసింహ విజయసింహ వంటి నవలలు రాసిన శ్రీశ్రీ, 14వ ఏట పరిణయ రహస్యం, 18వ ఏట ప్రభవను రచించారు. ఆయన సాహితీ తపస్సుకు గుర్తింపుగా “ఖడ్గసృష్టి” కావ్యానికి 1966వో సోవియట్‌ భూమి నెహ్రూ అవార్డు, 1973లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1979లో శ్రీరాజా లక్ష్మీ ఫౌండేషన్‌ వారి మొదటి అవార్డు అందుకున్నారు. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించిన మహాకవి శ్రీశ్రీ… 1983 జూన్‌15న మహాప్రస్థానమొందారు.

శ్రీశ్రీ గారి ప్రముఖ రచనలు :

1.మహాప్రస్థానం
2.ఖడ్గ సృష్టి
3.ప్రభవ
4.సిప్రాలి
5.మరోప్రపంచం
6.మరోప్రస్థానం
7.అనంతం-శ్రీశ్రీ ఆత్మకథ
8.చరమ రాత్రి

మహాకావ్యం

శ్రీశ్రీ- పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన 1933-40ల మధ్య రాసిన గీతాలే “మహాప్రస్థానం” కవితా సంపుటి. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మహాప్రస్థానానికి ముందు మహాప్రస్థానానికి తర్వాత అని విభజించవచ్చని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే… మహాప్రస్థానం కవితా సంపుటి తెలుగు సాహిత్యంపై అంతటి ప్రభావాన్ని చూపించింది. తన మిత్రుడైన కొంపెల్ల జనార్ధనరావు మరణించిన సందర్భంలో ‘తలవంచుకు వెలిపోయావా నేస్తం’ అంటూ… ఆయనపై కవితను రాసి, మహాప్రస్థానాన్ని ఆయనకే అంకితమిచ్చాడు శ్రీశ్రీ. చలం యోగ్యతా పత్రంలో .. క్రిష్ణశాస్ర్తి బాధ ప్రపంచానికి బాధ- ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అని వివరించిన తీరు చూస్తే ప్రపంచ మానవాళిని ఉద్ధేశించి శ్రీశ్రీ రాసిన కవిత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. అంతేకాకుండా నెత్తురూ, కన్నీళ్లూ కలిపి కొత్త టానిక్‌ తయారు చేశాడు ఈ వృద్ధ ప్రపంచానికి అన్నాడు చలం.

మహాప్రస్థానంలోని ప్రతి కవితా … దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులోని కొన్ని కవితల్లో శ్రీశ్రీ ప్రయోగించిన పదాలు సాధారణ పాఠకులకు అర్థం కావు కానీ… అందులోని అంతరార్థం మాత్రం చాలా లోతుగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

“మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు, పడండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి!” అంటూ పాఠకుల్లో ఏదో తెలియని ఉత్తేజాన్ని నింపుతాయి ఈ గీతాలు.

ఎన్నిసార్లు చదివినా నేటికీ కొత్తగా, ఆకర్షణీయంగా ఉంటాయీ కవితలు. తెలుగు పదాలలోని దమ్ము తెలియాలంటే శ్రీశ్రీ మెదడులో పుట్టిన మహాప్రస్థాన కవితలు చదవాల్సిందే! శ్రీశ్రీ కవితలు చదువుతుంటే పాఠకులకు… తెలుగు పదాలను ఇంత శక్తివంతంగా వాడచ్చా అన్న సందేహం కలుగకమానదు. శ్రీశ్రీ మహా‌ప్రస్థానం విప్లవ సాహిత్యాన్ని తట్టిలేపింది. “జయభేరి” ఖండికలో ‘నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను!’ అంటూ ఉర్రూతలూగిస్తాడు శ్రీశ్రీ. ‘కాదేదీ కవితకనర్హం!’ అని వాడుక భాష వాడాడు శ్రీశ్రీ. ‘బాటసారి’ కష్టాలు, బాధలు కళ్లకు కట్టినట్లు వివరించిన తీరు పాఠకుల కంటనీరు తెప్పించకమానదు. ‘భిక్షువర్షియసీ’లో దారి పక్కన కూర్చున్న ముసలిదానిపై మాట్లాడుతూ తన మానవత్వాన్ని చాటుకున్నాడు రచయిత. ‘జగన్నాథ రథచక్రాలు’, ‘దేశచరిత్రలు’ ఇలా ఏ ఖండిక తీసుకున్నా… అందులో పూరాణ పదజాలం వాడి, దానికి వ్యతిరేకమైన మార్క్స్ కమ్యూనిజాన్ని చొప్పించి చెప్పడం ఈ కవితల్లో కనిపిస్తుంది. ‘దేశచరిత్రలు’ ఖండికలో ‘ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం’ అంటూ ప్రశ్నిస్తాడు.

సమాజంలో సామాన్యుడి గురించి మాట్లాడని కవిత్వం… కవిత్వం ఎలా అవుతుందని శ్రీశ్రీ నిర్భయంగా ప్రశ్నించాడు. అంతేకాకుండా పిల్లల గురించి, వారి ఆటపాటల్ని ‘శైశవగీతి’లో చక్కగా వర్ణించారు రచయిత. ఇలా ఈ సంపుటిలో ఉన్న 41 గీతాలు ఒక్కొక్కటి దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. సంస్కృత పదాలు, పురాణాల్లోని పదాలు ఉండటం వల్ల కవితలు సామాన్య పాఠకులు పూర్తిగా అర్థం చేసుకోవడం కొంత కష్టమే అని చెప్పవచ్చు.

సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజల తరఫున గొంతెత్తి అరిచిన శ్రీశ్రీ… మహాప్రస్థానంలోని చాలా గీతాల్లో మార్క్సిజంలోని పదాలు, పురాణ పదాలు వాడుతూ అల్పాక్షరాలతో అనల్పమైన చారిత్రక వాస్తవికతను తెలియజేశాడు. వేసిన దారి వెంట వెళ్లడం సులభం, కొత్తదారులు వెతకడం కష్టం అని చెప్పిన శ్రీశ్రీ… కష్టమైనా ఇష్టంగానే ఆధునిక కవిత్వంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. అక్షరాల్ని పదునైన ఆయుధాలుగా వాడి శ్రీశ్రీ రాసిన కవితా సంపుటిని ఆధారంగా చేసుకొని ‘ఆకలిరాజ్యం’ అనే చిత్రం రూపుదిద్దుకుందంటే అతిశయోక్తి కాదు. అలాంటి గొప్ప కవితా సంపుటి పాఠకుల్ని ఎప్పుడూ చదివిస్తూ ఉంటుంది…

✍️✍️వరుకోలు ప్రవీణ్🙏

MQD(My Quote of the Day)😉

“We are good lawyers for our own mistakes,
and good judges for the mistakes of others.”

Genuinely its #AppyFizz 😝

పెళ్లి-దాని పుట్టుపూర్వోత్తరాలు- పుస్తకం సమీక్ష (Review of the Book)

పెళ్లి-దాని పుట్టుపూర్వోత్తరాలు

పుస్తకం పేరు : పెళ్లి-దాని పుట్టుపూర్వోత్తరాలు
రచయిత. : తాపీ ధర్మారావు
పేజీలు : 124
వెల : రూ.40
ప్రతులకు : విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌
4-1-435, విజ్ఞాన్‌ భవన్‌, అబిడ్స్,హైదరాబాద్-50001
ఫోన్‌ : 24744580 / 24735905

రచయిత గురించి : తాపీ ధర్మారావు… ప్రముఖ తెలుగు రచయిత, భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. ఆయన 1887సెప్టెంబర్,19న ప్రస్తుత ఒడిశాలోని బెర్హంపూర్‌ (బరంపురం) లోజన్మించాడు. తల్లి పేరు నరసమ్మ, తండ్రి పేరు అప్పన్న. ఆయన తొలి రచన ‘ఆంధ్రులకొక మనవి’ 1911లో వెలువడింది. జీవితాంతం సాహిత్య వికాసానికి కృషి చేసిన ఆయన… పత్రికా రంగంలోనూ రాణించారు. గిడుగు రామ్మూర్తి పంతులు ఆయన గురువు. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు నడిపారు. తాపీని గౌరవంగా తాతాజీ అని పిలిచేవారు. ఆయన 1973, మే 8న కన్నుమూశారు.

తాపీగారి ప్రముఖ రచనలు :
1.ఆంధ్రులకొక మనవి
2.పెళ్లి-దాని పుట్టు పూర్వోత్తరాలు
3.దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు?
4.ఇనుప కచ్చడాలు
5.రాలు-రప్పలు
6.పాతపాళీ
7.కొత్తపాళీ
8.ఆలిండియా అడుక్కుతినేవాళ్ల మహాసభ

పెళ్లి?

కొన్నివేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భూప్రపంచంలో రెండు జీవితాలను ఏకం చేసే ఉన్నతమైన ప్రక్రియ పెళ్లి. అటువంటి పెళ్లికి ఉన్న చరిత్ర ఏమిటి? పెళ్లి పద్ధతులు, రకాలు, పెళ్లిల్లో ఆచారాల వెనుక కథలేంటి ? అనే ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఆ విషయాలు తెలియాలంటే తాపీ ధర్మారావు గారి- 'పెళ్లి-దాని పుట్టుపూర్వోత్తరాలు' పుస్తకం చదవాల్సిందే! ప్రతివ్యక్తి జీవితంలో ఎంతో కీలకమైన అంశం పెళ్లి/వివాహం. భార్యాభర్తల అనుబంధం చాలా గొప్పదని అంటుంటారు పెద్దలు... అటువంటి పెళ్లి ఎలా పుట్టింది- అంటే...అత్యంత ప్రాచీన కాలం నుంచి నేటివరకు మానవ సమాజంలో జరుగుతున్న పరిణామ క్రమంలో భాగంగా జంతువు కన్నా భిన్నంగా ఉండాలన్న ఆలోచన మానవుడికి ఏర్పడినపుడు 'పెళ్లి' అనే భావన పుట్టింది. ఆదిమానవుని కాలంలో పెళ్లనే కాన్సెప్టే లేదు. కాలక్రమేణా మానవ సమాజం పరిణతి చెంది, నేడు ఈ స్థితికి చేరుకుందని రచయిత వివరించిన తీరు ప్రతి పాఠకున్నీ ఆకట్టుకుంటుంది.

వివాహంలో గల రకాలు- గాంధర్వం, బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, అసుర, రాక్షస, పైశాచి వంటి ఎనిమిది రకాల పెళ్లిళ్ల గురించి ఇందులో వివరిస్తారు రచయిత. పెళ్లిళ్లు కాలక్రమేణా ఏ విధంగా రూపుదిద్దుకున్నాయో.. రచయిత హాస్యాన్ని, వ్యంగ్యాన్ని జోడించి వివరించిన తీరు పాఠకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పెళ్లంటే ఏడేడు జన్మల బంధమని, అటు ఏడు తరాలు- ఇటు ఏడు తరాలు చూసి సంబంధం కలుపుకోవాలన్న పూర్వీకుల మాటల్ని రచయిత ఖండించి, అసలు అలాంటిదేమీ లేదని తేల్చడం సహా- గుడ్డిగా నమ్మి ఈ పెళ్లి తంతులు చేస్తున్న పురోహితుల్ని, పండితుల్ని విమర్శించిన తీరు చూస్తే రచయిత విమర్శనాధోరణి ప్రస్ఫుటమవుతుంది. రామాయణ, మహాభారతాల్లోని పలు ఘట్టాలను విశదీకరించిన తీరు కాస్త అసహజంగా అనిపించినా... పాఠకుల్ని ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తోడిపెళ్లికొడుకు అనే తతంగం ఎలా వచ్చిందనే ఆసక్తికర అంశాలు, శవవివాహాలు, మచ్చుపెళ్లిళ్ల గురించి రచయిత వివరించిన శైలి ఆశ్చర్యం కలిగించకమానదు.

పెళ్లి- ప్రశ్నలపరంపరతో ప్రారంభమైన పుస్తకం ముగింపు వరకు పాఠకున్ని ఏకబిగిన చదివేలా చేస్తుంది. జాతి అంతరించి పోకుండా ఉండేందుకే ప్రకృతిలో అన్నిరకాల జీవులు జతకట్టుతాయనీ, వాటిలో పెళ్లి అనే తంతేదీ లేదని... విమర్శనాత్మకంగా వివరించారు. పెళ్లి అనేది కేవలం మనుషులు చేసుకున్న కట్టుబాటు మాత్రమేనని, స్వేచ్ఛను నియంత్రించేదే పెళ్లి అని, పరిణామ క్రమంలో భాగంగా ఆచార వ్యవహారాలు మారాయని అవగతమవుతుంది. రచయిత చెప్పదల్చుకుంది నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా వివరించిన తీరు, ప్రశ్నించిన తీరు పాఠకులకు హాస్యానివ్వడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. రచయిత స్ర్తీ బానిసత్వాన్ని ఖండిస్తూ... అధికారాన్ని స్ర్తీ జాతి నుంచి పురుష జాతి చేజిక్కించుకుందని వివరించడం జరుగుతుంది. రచయిత స్వతహాగా హేతువాది అయినప్పటికీ... పురాణాల్ని వల్లెవేస్తూ ఉదహరించిన తీరు పాఠకులకు రుచించకపోవచ్చు. 'పెళ్లి-దాని పుట్టుపూర్వోత్తరాలు' లో చెప్పిన విషయాలు సంప్రదాయవాదులకు, సనాతనవాదులకు కాస్త కఠినంగా అనిపిస్తాయి. కానీ, దీన్ని (ఈ పుస్తకాన్ని) ప్రతి పాఠకుడు అధ్యయన కోణంలో చదివినపుడే మంచి రసానుభూతిని పొందుతాడు.

భారతీయ ఆచార- వ్యవహారాలను, సంప్రదాయాలను, వివాహ బంధాలను అవమానించేలా అక్కడక్కడ రచనలు కనిపిస్తాయి. మొత్తంగా... పెళ్లి చేసుకోబోయేవారు, చేసుకున్నవారు, పెళ్లి-చరిత్ర తెలుసుకోవాలనుకునే వారందరికీ ఒక అవగాహన కల్పిస్తుందీ పుస్తకం...

✍️✍️✍️వరుకోలు ప్రవీణ్‌, ఈనాడు జర్నలిజం స్కూల్-2019-20